Sunday, March 17, 2024

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

 

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

పసునూరి సోమరాజు
ఫోన్ : 9490666284
సంపాదక వర్గ సభ్యులు,
పంచాయితీరాజ్ ఉపాద్యాయ

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రత్యక్ష నియామకాలలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లను వర్తింపజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో భారతదేశంలో రాజ్యాంగపరమైన రిజర్వేషన్లలో నిలువు, సమాంతర రిజర్వేషన్ల గూర్చిన చర్చకు తెరలేచింది.

దీని యొక్క పూర్వా పరాలు గమనిస్తే....

తెలంగాణ రాష్ట్ర పభ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నగ్రూప్ – 1  నియామకాలలో మహిళా అభ్యర్థులకు నిలువు రిజర్వేషన్ సూత్రాన్ని అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు TSPSC చర్య చట్ట విరుద్ధమంటూ కొడెపాక రోహిత్, డి. బాలకృష్ణ మరియు ఇతరులు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. దీనిపై జస్టీస్ పి. మాధవీదేవి నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం మహిళా రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు రాజేష్ కుమార్ దరియా Vs రాజస్తాన్ పభ్లిక్ సర్వీస్ కమీషన్  కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ నియామకాలలో మహిళలకు సమాంతర పద్ధతిలో రిజర్వేష్న్లను వతింపజేయాలంటూ మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున Govt. Memo No. 4981/ Ser – D/ A2/ 2023. Dated. 01.02.2024.  మెమోను జారీ చేసి,  అన్ని నియామక సంస్థలకు పంపించారు.

విషయంలో న్యాయవివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ  33  1/2  శాతం రిజర్వేషన్ల అమలు కోసం గతంలో జారీ చేసిన ఉత్తర్వులు G.O. Ms.No. 41, WD & CW (Estt) Dept. Dated. 01.08.1996. మరియు G.O. Ms.No. 56, WD & CW (Estt) Dept. Dated. 28.10.1996.  మరియు  రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీసు నిబంధనలు, 1996 నందలి రూల్ 22 కు సవరణలు చేయాలని పేర్కొంటూ మహిళా శిశు సంక్షేమ శాఖకు TSPSC కార్యదర్శి  లేఖ ( Letter No. 125/RR/TSPSC/2021 Dated. 08.02.2024. ) రాశారు.   మేరకు ఆయా ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారు G.O.Ms.No. 03, WCD&SC 9Prog – I). Dated 10.2.2024.  ఉత్తర్వులు జారీ చేశారు.  అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీసు నిబంధనలు, 1996 లోని  రూల్ 22 మరియు 22-A లకు సవరణలు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు G.O.Ms.No. 35, GAD (Ser – D) Dept. Dated. 13.02.2024.  ఉత్తర్వులను జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం మహిళలకు OC,  EWS, SC, ST, BC-A, BC-B, BC-C, BC-D, BC-E , దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారుల కోటాలో రోస్టర్ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా సమాంతర పద్ధతిలో 33.33% రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

రిజర్వేషన్లలో రకాలు:

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 మరియు 16 లలో ఉదహరించబడిన రిజర్వేషన్లను సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా స్థూలంగా 2 రకాలుగా తెలియజేయవచ్చు.

 అవి 1. సామాజిక రిజర్వెషన్లు / నిలువు రిజర్వేషన్లు

        2. ప్రత్యేక రిజర్వేషన్లు / సమాంతర రిజర్వేషన్లు

1. సామాజిక రిజర్వేషన్లు / నిలువు రిజర్వేషన్లు

సామాజిక వివక్షతో అణచివేతకు గురై సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు ఉద్ధేశించిన రిజర్వేషన్లను సామాజిక రిజర్వేషన్లుగానూ, వీటిని మెరిట్ కం రోస్టర్ లో నిలువుగా అమలు చేస్తున్నందున వీటిని నిలువు లేదా వర్టికల్ రిజర్వేషన్ పద్ధతిగా అభివర్ణిస్తారు. భారత రాజ్యాంగంలోని 3 భాగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం SC, ST, BC, EWS  వర్గాల వారికి కేటాయించిన పోస్టులను ఆయా వర్గాల అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. వీరు ఓపెన్ కేటగిరీ ( OC) లో మెరిట్ పోస్టులకు ఎంపికైతే వారిని ఓపెన్ కేటగిరీ పోస్టుకు ఎంపికైనట్లుగా భావిస్తారు. వారికి రిజర్వ్ చేసిన పోస్టులను డీ రిజర్వ్ చేయరు. మెరిట్ లిస్ట్ లోని తదుపరి ఆయా రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు.

2.ప్రత్యేక రిజర్వేషన్లు / సమాంతర రిజర్వేషన్లు.

సామాజికంగా వెనుకబడి సరైన ప్రాతినిథ్యం లేని వర్గాలు అనగా వీరు  OC, SC, ST, BC, EBC  వర్గాలలో భాగమైనప్పటికీ మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, NCC, వంటి ప్రత్యేక వర్గాల వారి ప్రాతినిథ్యం కోసమై రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) లో నిర్ధేశించబడిన విధంగా ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించబడినవి.  అయితే రిజర్వేషన్లు OC, SC, ST, BC, EWS  కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన పోస్టులలోనే వర్గాలకు సమాంతరంగా పోస్టులను కేటాయిస్తారు. కాబట్టి ప్రత్యేక వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను సమాంతర లేదా  హారిజాంటల్ రిజర్వేషన్లు గా భావిస్తారు.

వివాదం ఏమిటి?

ప్రత్యేక రిజర్వేషన్లను ఆయా వర్గాల ప్రాతినిథ్యం ఉండేలా OC, SC, ST, BC, EBC  వర్గాల రిజర్వేషన్ల పోస్తులలోనే సమాంతర పద్ధతిలో  భర్తీ చేయాలి.  ఓపెన్ కేటగిరీ మరియు ఆయా సామాజిక వర్గంలో ప్రత్యేక వర్గాల ప్రాతినిథ్యం వారికి కేటాయించిన నిష్పత్తి ప్రకారం అప్పటికే భర్తీ అయిన పక్షంలో వారి పోస్టును డీ రిజర్వు చేసి, మెరిట్ లిస్టులోని మిగతా వారితో భర్తీ చేయాలి. రిజర్వ్ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు OC, SC, ST, BC, EWS  వర్గాలతో పాటు మహిళలకు కూడా అదే నిలువు వరుసలో రోస్టరు పాయింట్లను కేటాయించారు. దీనిని బట్టి మహిళలు వారికి కేటాయించిన పోస్టులతో పాటు మిగతా పోస్టులకు కూడా ఎంపిక కావచ్చు. వారు ఓపెన్ కేటగిరీ లో ఎంపికైనప్పటికీ వారి రిజర్వ్ పోస్టును డీ రిజర్వ్ చేయకుండా, ప్రాతినిథ్య శాతం మించినప్పటికీ రోస్టర్లో వారికి కేటాయించిన పోస్టును మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేశారు. మహిళా అభ్యర్థులు లేని పక్షంలో పోస్టులను భర్తీ చేయకుండా క్యారీ ఫార్వర్ద్   ( తదుపరి రిక్రూట్మెంట్ కు)  చేయడం జరిగింది. 

విధానం అమలులో లోపాలను గమనించిన పలువురు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించి తమకు అనుకూలంగా తీర్పులను పొందడం జరిగింది.

రాజేష్ కుమార్ దరియా Vs రాజస్తాన్ పభ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఇతరుల కేసు ( Civil Appeal  No. 3132 of 2007. Dated. 18.7.2007 ) ( 2007 (8) SCC 785) లో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరిస్తూ SC, ST, OBC లకు ఆర్టికల్ 16(4) ప్రకారం సామాజిక రిజర్వేషన్లను నిలువుగానూ , ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 15(3) ప్రకారం దివ్యాంగులు, మహిళలు మొదలగు ప్రత్యేక వర్గాలకు సమాంతర పద్ధతిలోనూ రిజర్వేషన్లను వర్తింపజేయాలని ఉత్తర్వులు వెలువరించింది.

ఇదే విధమైన తీర్పు ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ VS మమతా బిస్త్ ( 2010 (2) SCC 204 ) కేసులోనూ,  సౌరవ్ యాదవ్ మరియు ఇతరులు Vs  స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ ( WP (Civil) No. 237 of 2020 ) కేసులోనూ,  అనిల్ కుమార్ గుప్తా మరియు ఇతరులు Vs  స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ ( 1995 SCC (5) 173, JT 1995 (5) 505  ) కేసులోనూ,  జనహిత్ అభియాన్ Vs  యూనియన్ ఆఫ్ ఇండియా ( WP ( Civil) No. 55 of 2019 ) కేసులోనూ  ప్రత్యేక వర్గాలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించాలనే తీర్పు వెలువరించింది.

తీర్పుల నేపథ్యంలో గుజరాత్, అస్సాం, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్తాన్ లతో పాటు ఇతర రాష్ట్రాలు వారి రిజర్వేషన్ విధానంలో మార్పులను చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన తప్పును గ్రహించి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన మహిళ రిజర్వేషన్లకు సంబందించిన ఉత్తర్వులు మరియు రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 లను సవరిస్తూ G.O.Ms. No. 40, WCDA & SC ( Prog – II) Dated. 25.07.2016 ను, G.O.Ms. No. 63, GAD ( Ser - D) Dept.  Dated. 23.01.2018  ను మరియు G.O.Ms. No. 77, GAD ( Ser - D) Dept.  Dated. 02.08.2023 ఉత్తర్వుల ద్వారా ఉద్యోగ నియామకాలలో మహిళా రిజర్వేషన్లను సమాంతర పద్ధతిలో అమలు చేస్తున్నది.

కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయకుండా గత విధానంలోనే మహిళా రిజర్వేషన్లను నిలువు విధానంలో అమలు చేయడం వలన మెరిట్ అభ్యర్థులకు నష్టం కలుగుతుందని, ఇది రాజ్యాంగ, చట్ట వ్యతిరేఖమని కొడెపాక రోహిత్ మరియు ఇతర కొందరు గ్రూప్ - 1 అభ్యర్థులు TSPSC  మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా తెలంగాణ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయడంతో దానిని విచారించిన హైకోర్టు ధర్మాసనం రాజేష్ కుమార్ దరియా Vs రాజస్తాన్ పభ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఇతరుల కేసు ( 2007 (8) SCC 785)   లో సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని నియామకాలలో  మహిళా రిజర్వేషన్లను సమాంతర పద్ధతిలో వర్తింప జేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది.

ఇప్పుడెలా అమలవుతాయి ?

సమాంతరం రిజర్వేషన్లు (Horizontal Reservation) అంటే.. OC, SC, ST, BC, EWS  కేటగిరీల్లో రిజర్వ్ చేసిన పాయింట్లలో మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్మెన్ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. అయితే రోస్టర్ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎక్కువ పోస్టులు వస్తే అవి వారికే ఉంటాయి. వాటి సంఖ్యను ఎట్టిపరిస్థితుల్లో తగ్గించడానికి వీల్లేదు. సమాంతర రిజర్వేషన్లు అమలైతే  మహిళలు OC, SC, ST, BC, EWS, దివ్యాంగుల కేటగిరీల్లోని జనరల్ కోటాలో మెరిట్ ప్రకారం వారికి కేటాయించిన సంఖ్యకు సమానంగా పోస్టులు సాధిస్తే.. రిజర్వుడు కేటగిరీలో మహిళల కోసం ప్రత్యేకంగా పేర్కొన్న పోస్టులను డీ-రిజర్వ్ చేస్తారు. ఉదాహరణకు.. ఒక సామాజికవర్గంలో  1 నుంచి 10 వరకు పది పోస్టులు ఉన్నాయి అనుకంటే.. వాటిలో 8, 9, 10 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. లెక్కన సామాజికవర్గం నుంచి 10 పోస్టుల్లోని తొలి మూడు పోస్టులకు మెరిట్ ప్రకారం మహిళలే సాధించారనుకుందాం. అప్పుడు.. మహిళలకు కేటాయించిన సంఖ్యకు సమానంగా పోస్టులను వారు దక్కించుకున్నందున, వారికి ప్రత్యేకంగా కేటాయించిన 8, 9, 10 పోస్టులను మహిళా రిజర్వేషన్ల నుంచి డీ-రిజర్వ్ చేస్తారు. అప్పుడు మూడు పోస్టులు అదే సామాజికవర్గంలో జనరల్ పోస్టులువుతాయి. పోస్టులకు మహిళలు, పురుషులు సమానంగా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తొలి ఏడు పోస్టుల్లో ఒక దానికే మహిళ మెరిట్ కింద ఎంపికైతే మహిళలకు కేటాయించిన మూడు పోస్టుల్లో ఒకటి డీ-రిజర్వ్ అవుతుంది. ఒకవేళ మెరిట్లో మొత్తం మహిళలే ఉంటే.. 10 పోస్టుల్లోనూ మహిళలు ఎంపికయ్యేందుకు అవకాశాలున్నాయి.

కాగా విధానం పై మిశ్రమ స్పందన వ్యక్తమౌతున్నప్పటికీ, సమాంతర ( Horizontal ) రిజర్వేషన్ల ద్వారా మహిళలకు అన్ని వర్గాల్లో సరైన ప్రాతినిథ్యం కలుగజేస్తూ, మెరిట్ అభ్యర్థులకు కూడా తగు న్యాయం జరుగుతుంది .



No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు